కోనరావుపెట : ప్రభుత్వం సన్న వడ్లకు అందించే బొనస్ దేవుడెరుగు కానీ సెంటర్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కోనుగోలు చేయక పోతే పురుగుల మందే శరణ్యం అంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపెట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వం రెండు నెలల క్రితం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించింది. రైతులు పంటను కోసింది కోసినట్టుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. కానీ అధికారులు అడపాదడప దొడ్డు వడ్లను కోనుగోలు చేసి సన్న వడ్ల కోనుగోలులో మాత్రం జాప్యం చేస్తున్నారు. అధికారులు సైతం పట్టించుకోక పోగా వర్షం కురియడంతో వరి ధాన్యం కుప్పల పైన మొలకలు వచ్చాయి.
ఈ క్రమంలో ఆగ్రహించిన రైతులు చెమటోడ్చి ధాన్యం పండిస్తే ప్రభుత్వము పట్టించుకోకుండా నేలపాలు చేస్తుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్స్ పెట్టడం తప్ప సెంటర్కు వచ్చి రైతుల పరిస్థితి తెలుసు కోవడం లేదన్నారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే మిల్లర్లు సన్న వడ్లు దించుకోవడం లేదని మేము ఏమి చేయలేమని చేతులెత్తేశారు. దీంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రైతులు పేర్కోన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి సెంటర్ లోని వడ్లు కోనుగోలు చేయాలనీ లేదంటే పురుగుల మందు తగడమే మా పరిస్థితి అని రైతులు వాపోతున్నారు.