నేను మంత్రిని కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా మంత్రుల వద్దకు అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు. కానీ.. నాకు నయాపైసా ఇవ్వాల్సిన పనిలేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మీ పేరు గుర్తుండి పోతుంది అని అన్నాను.
-గురువారం వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ
Konda Surekha | హైదరాబాద్ మే 16 (నమస్తే తెలంగాణ): ఓవైపు కాంగ్రెస్ పాలన లో రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే.. మరోవైపు కమీషన్లతో మంత్రులు జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గురువారం చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని నిర్ధారించేలా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్‌లో ఓ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిని కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్ కోసం వస్తాయి.
మామూలుగా మంత్రుల వద్దకు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల అవినీతికి కొండా సురేఖ వ్యాఖ్యలు నిలువుటద్దమని రాజకీయ విశ్లేషకులు పే ర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై విచ్చలవిడి ఆరోపణలు వస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఒక్కరు కాదు..ఇద్దరు కా దు.. మంత్రివర్గంలో సీఎం సహా 12మంది మంత్రులు ఉండగా, ఒకరిద్దరు మినహా అందరిపైనా అవినీతి ఆరోపణలు రావడంతో కాం గ్రెస్ ప్రభుత్వాన్ని ‘కమీషన్ల ప్రభుత్వం’గా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 10% కమీషన్లతో మొదలై 20%, 30% అంటూ మంత్రులపై ఆరోపణలు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆర్ ట్యాక్స్ వసూళ్లపై తాజాగా రియల్టర్లు రాహుల్‌గాంధీకి లేఖ రాయగా, ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ఏకంగా ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ నిజమేనని కొండా సురేఖ తన వ్యాఖ్యలతో నిర్ధారించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘కాంగ్రెస్ పాలన అంటే కమీషన్లు, కలెక్షన్లు, కరప్షన్’ అని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటు ఎన్నికల ముందు ఖజానా నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరిగింది. ఆ సమయంలో ‘గట్టి’ ట్యాక్స్ చెల్లించిన వారికే బిల్లులు మంజూరయ్యాని విమర్శలు వచ్చా యి. ఎనిమిది శాతం కమీషన్లను ఓ మంత్రి భార్య స్వయంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి.
దీంట్లో అధిష్ఠానానికి వాటా లు పంపాల్సి ఉంటుందని వారు చెప్పినట్టు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతున్నదని, పైగా కమీషన్ రెట్టింపు అయ్యిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు పనులు తెచ్చుకోవాలని, ‘నిర్దేశిత’ కమిషన్ తీసుకొని రూ.5 కోట్ల వరకు బిల్లులు విడుదల చేస్తామని, ఆపైన మీ ఇష్టమున్నంత వేసుకోవచ్చు’అని చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు బిల్లుల కోసం కాంట్రాక్టర్ల చుట్టూ, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరగడం కనిపించిందని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.
ఇక.. అధికారంలోకి వచ్చినప్పుడు 8 శాతంగా కమీషన్ ఇప్పుడు 30 శాతానికి చేరిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరో ఆషామాషీగా అన్నది కాదని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపించారని చెప్తున్నారు. ఓ మంత్రి 30% కమీషన్ అడుగుతున్నారని, దీనికి వ్యతిరేకంగా పదిమంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ భేటీ చివరకు అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లింది.
ఇక మంత్రులు వసూలు చేస్తున్న కమీషన్లను వ్యతిరేకిస్తూ కొందరు కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే ధర్నాకు దిగడం సంచలనం సృష్టించింది. ఇక ఓ మంత్రి వివాదాస్పద భూములను సెటిల్మెంట్ చేసి, సగం భూమిని వాటాగా తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మైనింగ్ లీజులు, క్రషర్ల లీజులు, ఇసుక క్వారీల్లో బలవంతంగా వాటాలు రాయించుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతున్నది. ఆర్ఆర్ ట్యాక్స్‌పై ప్రధాని ఆరోపణలు.. రాహుల్‌కు ఫిర్యాదు రియల్ ఎస్టేట్ రంగంపై ‘ఆర్ ట్యాక్స్’ నడుస్తున్నదని మొదటినుంచీ ఆరోపణలున్నా యి. ముఖ్యనేతకు చెందిన బంధువులు, అనుచరులు ఓ గ్రూప్‌గా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నట్టు రియల్టర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్‌పై ఏకంగా ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో కాంగ్రెస్ ప్రభు త్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలిసింది. ఓ మంత్రి రంగంలోకి దిగారని.. శుక్రవారం ఉదయమే ఆమెకు ఫోన్ చేసి ’ఏం అమ్మా.. మీరు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ పరువు గంగలో కలుస్తున్నది. సీఎం కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నారు’ అంటూ అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కమీషన్ సర్కారు నడుస్తున్నది..గతంలో కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే ధర్నాలు చేసి ఓ మంత్రికి 30 శాతం ముట్ట జెప్పందే బిల్లులు రావడంలేదని ఎండగట్టారు. ప్రజల్లోనూ ఇదే చర్చ నడుస్తున్నది. వెంటనే కమీషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లు కొండా సురేఖ బయటపెట్టాలి. ఏదేమైనా వాస్తవాలు మాట్లాడిన కొండా సురేఖకు హృదయపూర్వక ధన్యవాదాలు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్