సిద్దిపేట, జనవరి 24 : సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలకు, కుడికాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు వదులుతున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం రంగనాయకసాగర్ నుంచి కాల్వలకు సాగునీటిని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్‌తో కలిసి ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ కింద 1.10 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నదని అన్నారు. రంగనాయక సాగర్‌లో ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నదని చెప్పారు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం పూర్తయిందన్నారు. ఎడమ కాలువ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, సిద్దిపేట రూర ల్, నారాయణరావుపేట, సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాలకు, కుడి కాలువ ద్వారా సిద్దిపేట అర్బన్, నంగునూరు మండలాల్లోని చెక్‌డ్యామ్‌లు, చెరువులకు సాగునీరు విడుదల చేశామని తెలిపారు.