Medaram Jathara | ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతర తొలి రోజే రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైనప్పటికీ దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మాత్రం మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంతో మంత్రుల మధ్య విభేదాలు ఇంకా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
మేడారం మహా జాతరలో బుధవారం తొలి ఘట్టం పూర్తయ్యింది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలుకగా, ముగ్గురి రాకతో మేడారమంతా సంబురంతో ఓలలాడింది. ఈ సందర్భంగా వన దేవతలకు అధికారికంగా స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి దేవతలకు ఘనంగా ఆహ్వానం పలికారు. అలాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కుటుంబసభ్యులతో కలిసి జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొంటూ జాతర వాతావరణంలో కలిసిపోయారు. కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాజాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల మేడారం జాతర టెండర్ల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేుకుంటున్నారని కొద్దిరోజుల కిందటే హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మేడారం అభివృద్ధి పనులను పొంగులేటికి చెందిన కంపెనీకి రాష్ట్ర సర్కార్ అప్పగించింది. దీంతో ఉప్పు నిప్పులా ఉండే సురేఖ, పొంగులేటి మధ్య మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఆ విభేదాలు ఇంకా పూర్తిగా తొలగలేదని ఈ చర్యతో అర్థమవుతోంది.
సురేఖ పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు, ఆమెను త్వరలోనే మంత్రి పదవి నుంచి తప్పిస్తారని మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, పార్టీలో అసంతృప్తి చెలరేగకుండా ఉండేందుకు పార్టీ హైకమాండ్ సూచనల ప్రకారం పాతవారిని కదిలించకుండానే ముగ్గురు కొత్త మంత్రులకు స్థానం కల్పించారు. ముఖ్యంగా బీసీ నేతను మంత్రివర్గం నుంచి తప్పించారనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే పార్టీ వెనక్కి తగ్గినట్లు అప్పట్లో రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా ఆమె వద్ద పనిచేస్తున్న ఓఎస్డీపై అవినీతి ఆరోపణలు రావడం, ఈ వ్యవహారం అరెస్టు వరకూ వెళ్లడం చూస్తుంటే సురేఖను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.