హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం ఆర్ధరాత్రి 12.02 నిమిషాలకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జునను గానీ ఆయన కుటుంబాన్ని గానీ కించపరిచే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే మంత్రి సురేఖ ఉన్నట్లుండి అర్ధరాత్రి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేయడంపై జోరుగా చర్చ జరుగుతున్నది.
అసలేం జరిగింది, ఇంతలో అంత మార్పు ఎలా వచ్చింది, అర్ధరాత్రి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన కుటుంబానికి వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం గమనార్హం. కొండా సురేఖ క్షమాపణలతో నాగార్జున తన కేసును ఉపసంహరించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.