హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం చేయించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారు. స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి పనులు అప్పగించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది జరుగనున్న బ్రహ్మోత్సవాలకు, అంటే మార్చి 2025 నాటికి పూర్తి చేయాలని సంకల్పించింది. పనుల పర్యవేక్షణతోపాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పనులను వెంటనే ప్రారంభించి గడువులోగా పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
స్వర్ణతాపడానికి 65 కోట్ల అంచనా..
గత కేసీఆర్ సర్కారు 125 కిలోల మేలిమి బంగారంతో విమానగోపురానికి స్వర్ణతాపడం చేయాలని నిర్ణయించింది. స్వయంగా కేసీఆర్ కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. స్వర్ణతాపడానికి రూ.65 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేయగా, దాతల నుంచి 10 కిలోలకు పైగా బంగారం, రూ.30 కోట్లకు పైగా నగదు సమకూరింది.
భద్రాద్రిలో భూసేకరణకు ఉత్తర్వులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ చంద్రస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ నిమిత్తం భూసేకరణకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అప్పట్లో రూ.100కోట్లు మంజూరు చేసింది. అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు ముందుకు సాగలేదు.