హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రిగా ఉన్న విభేదాలు పీఠాలు కదిలే స్థాయికి చేరాయి. క్రమశిక్షణ పేరుతో తనను బలిపశువును చేసేందుకు అధిష్ఠానం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి వేసిన ఎత్తులకు మంత్రి కొండా సురేఖ దిమ్మతిరిగే లేఖాస్ర్తాన్ని సంధించినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన సురేఖ, తన వాదనను బలంగా వినిపించినట్టు సమాచారం. ఖర్గేకు ఓ లేఖను అందించారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎం కుటుంబసభ్యులపై వచ్చిన ఆరోపణలు, మంత్రి పొంగులేటి వ్యవహారాలు, పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ఆ లేఖలో సురేఖ స్పష్టంగా వివరించినట్టు తెలిసింది.
లేఖలో కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుల భూ వ్యవహారాలను ఎత్తిచూపినట్టు ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములను సమీకరిస్తున్నారని, రియల్ ఎస్టేట్ ముసుగులో బినామీ పేర్లతో స్థాపించిన డొల్ల కంపెనీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించినట్టు తెలిసింది. ప్రతి ఆరోపణకూ తన వద్ద పక్కా ఆధారాలున్నాయని, అధిష్ఠానం ఎప్పుడు కోరితే అప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నట్టు సమాచా రం. సీఎం కుటుంబసభ్యుల వ్యవహారాలు, నిధుల ప్రవాహంపై దృష్టి సారించకుండా, తనపైనే చర్యలకు ఉపక్రమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించినట్టు తెలిసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పలు వివాదాస్పద అంశాలను సైతం సురేఖ తన లేఖలో ప్రస్తావించినట్టు తెలిసింది. పొంగులేటి కుటుంబసభ్యులకు సంబంధించి కోట్ల రూపాయల విలువైన విదేశీ వాచ్‌ల తరలింపు వ్యవహారంలో కస్టమ్స్ అధికారుల దర్యాప్తు ఉదంతాన్ని, గతంలో ఆయన నివాసాలు, సంస్థలపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడుల వివరాలను గుర్తుచేసినట్టు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో విలువైన భూములను 22ఏ కింద పెట్టి, ప్రైవేట్ రెవెన్యూ శాఖతో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని.. సీఎం, రెవెన్యూ మంత్రులు ఇద్దరూ కూడబలుక్కొనే ఈ స్కామ్‌ను తెరమీదికి తెచ్చారని ఆరోపించినట్టు తెలిసింది.
తనపై సొంత పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు నిర్వహించి అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి రాదా? అని సురేఖ ప్రశ్నించినట్టు తెలిసింది. సదరు శాసనసభ్యులకు సీఎం కార్యాలయం నుంచే ప్రోత్సాహం లభించిందని, పార్టీ అంతర్గత వేదికలను కాదని బహిరంగంగా మాట్లాడిన వారిపై క్రమశిక్షణా కమిటీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీసినట్టు సమాచారం.
కొండా కుటుంబానికి గతంలో ఇచ్చిన రాజకీయ హామీలు నెరవేరకపోవడంపై కూడా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెళ్లిన ప్రతిచోట తనను, తన భర్తను అవమానించారని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. ఇచ్చిన మాటకు విరుద్ధంగా, తన భర్త కొండా మురళీధర్‌రావుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా పకన పెట్టారని వాపోయినట్టు తెలిసింది.
పార్టీలో అగ్రవర్ణ నేతలకు ఒక న్యాయం, బలహీనవర్గాలకు చెందిన తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతున్నదన్న భావనను సురేఖ లేఖ ద్వారా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఏఐసీసీ సభ్యురాలిగా పార్టీ పట్ల విధేయతతోనే పనిచేస్తున్నానని, ఆత్మగౌరవాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేస్తూ, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె కోరినట్టు తెలిసింది. ఖర్గేకు లేఖను స్వయంగా అందించిన సురేఖ వేణుగోపాల్‌కు వాట్సాప్ ద్వారా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి ఈ-మెయిల్ ద్వారా పంపించినట్టు సమాచారం.