హైదరాబాద్: క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా తనను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) అన్నారు. పనిచేసే వారిపైనే రాళ్లు విసురాతరని చెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నారు. 44 ఏండ్లుగా ఇది కొనసాగుతూనే ఉన్నదని తెలిపారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని, బీసీ కార్డును పట్టుకునే బతుకుతున్నానని వెల్లడించారు. తన సతీమణి, మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయ పరిణామాలపై వివరించారు. తాజా పరిణామాలపై 16 పేజీల లేఖ అందించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. చాలా కేసులకే నేను భయపడలేదు. నాకు భయం లేదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నా.
నేను బీసీ కార్డు పట్టుకునే బతుకుతున్నా. పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే జనం నా దగ్గరికి వస్తారు. పనిచేసే వారిపైనే కొందరు రాళ్లు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు. నేను ఎవరికీ భయపడేది లేదు. నాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదు. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ వచ్చేలా చూస్తాం. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్‌తో చెప్పా. మా సేవల్ని పార్టీ ఉపయోగించుకోవాలని కోరాం. పార్టీకీ మీ సేవలు అవసరమని మీనాక్షీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యం. రేవంత్‌రెడ్డిని ఇంకో పదేండ్లు ముఖ్యమంత్రిగా చూడాలి. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు అండగా నిలుస్తా.’ అని మురళి చెప్పారు.
తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను నిబంధనల ప్రకారమే పని చేస్తున్నాని చెప్పారు. తన శాఖలో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చని, మంత్రిగా ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదని వెల్లడించారు. సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తమని, ఆమెకు తమ ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదన్నారు. ఆమె రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేమని తెలిపారు. భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అధికారం ఆమెకు ఉందని, ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామని చెప్పారు.