Revanth Reddy | సుల్తాన్ బజార్, మార్చి 9 : ఆసిఫాబాద్‌లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెడుతుతన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన 17వ అఖిల భారత పద్మశాలి, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సభలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మశాలీలు ఆత్మ గౌరవానికే కాదు త్యాగానికి సైతం మారుపేరు అందుకు నిదర్శనమే కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
మలి దశ తెలంగాణ ఉద్యమం కోసం జల దృశ్యంలోని తన ఇంటిని అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా 2011లో సోనియాగాంధీ అధ్యక్షతన కులగణన చేయగా తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నేటి వరకు తొక్కి పెట్టిందని విమర్శించారు. కులగణన చేసిన తీరుతామని రాహుల్‌గాంధీ ప్రకటించిన నేపథ్యంలో ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
రైతన్నలు, నేతన్నలు తమకు రెండు కళ్లలాంటి వారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 65 లక్షల మంది మహిళలకు నాణ్యమైన రెండు చీరలను పంపిణీ చేసేలా నేతన్నలను ఆర్డర్లు ఇస్తామని.. అందుకోసం రూ.600 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్ లో నేతన్నల కోసం నిర్మిస్తున్నటువంటి మార్కండేయ భవన్‌కు తెలంగాణ రాష్ట్రం తరఫున కోటి రూపాయలను అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.