ఖైరతాబాద్, మే 10 : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీ కులాల్లో అత్యధికంగా నష్టపోయింది మున్నూరుకాపులేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మ్యానిఫెస్టో హామీలను విస్మరించిందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండాదేవయ్య పటేల్ ఆరోపించారు. ‘ఒకే కులం-ఒకే సంఘం’ నినాదంతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సంఘం రాష్ట్ర, జిల్లాల కమిటీలతో ఏర్పాటుచేసిన రౌండ్ టే బుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1931 కులగణన సర్వేలో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులు, కాంగ్రెస్ చేసిన కులగణనలో తక్కువగా చూపినట్టు పేర్కొన్నారు.
రాష్ట్ర జనాభాలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరుకాపులు.. కులగణనలో మాత్రం మూడు శాతమే ఉన్నట్టు చూపి బీసీల్లో ఐదో స్థానంలో పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం అన్యాయం చేశారని, ఇతర బీసీ కులాలకు నిధులిచ్చి మున్నూరుకాపులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. త్వరలోనే నూతన రాష్ట్ర కమిటీకి ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30, 31 తేదీల్లో అమెరికాలో జరిగే మహాసభ ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్వీ మహేందర్‌కుమార్, గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు సంగాని రజినీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.