Konatham Dileep | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందునే తనపై రేవంత్ సర్కారు కత్తిగట్టి వేధింపులకు పాల్పడుతున్నదని ప్రభుత్వ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం ఆరోపించారు. ఇప్పటికే 11 అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి దిగిందని మండిపడ్డారు. తన వ్యక్తిగత విదేశీ పర్యటనలకు సుమారు రూ.18 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసినట్టు కొత్త డైవర్షన్ డ్రామాకు సీఎం కార్యాలయం తెరలేపిందని ఆరోపించారు. ఆ వార్త పచ్చి అబద్ధమని, తనపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తను ప్రచురించాయని ఆక్షేపించారు. వాటికి పరువు నష్టం కింద నోటీసులు పంపించనున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా నాటి ఐటీ మంత్రి కేటీఆర్ బృందంతో కలిసి పదేండ్ల్లలో (2014-2023) తొమ్మిదిసార్లు విదేశాలకు వెళ్లామని, అవన్నీ పెట్టుబడుల ఆకర్షణ కోసం జరిగిన అధికారిక పర్యటనలేనని, ఒకటి కూడా వ్యక్తిగతమైనది కాదని స్పష్టంచేశారు. ఈ పర్యటనలకు అయిన ఖర్చు అంతా ఐటీశాఖ అధికారికంగానే చెల్లించిందని, ఇందులో డిజిటల్ మీడియా నిధులు ఒకపైసా కూడా వినియోగించలేదని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నాటి ఐటీ మంత్రి కేటీఆర్ అధికారిక విదేశీ పర్యటనల వివరాలు ప్రజాబాహుళ్యంలోనే ఉన్నాయని, వివరాలు, ఫొటోలు ఎప్పటికప్పుడు కేటీఆర్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు అయ్యాయని, ప్రజలకు తెలిసిన సమాచారాన్ని ఏదో కొత్తగా కనుగొన్నట్టు కొన్ని పత్రికలు వార్తగా ప్రచురించడం శోచనీయమని మండిపడ్డారు.
ఉద్దేశపూర్వకంగా అల్లిన కథనం
‘1) కొణతం దిలీప్ విదేశీ పర్యటనల వి వరాలు 2) గత ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం మొదటి నుంచి పెట్టిన ఖర్చు వివరాలు విడివిడిగా ఇవ్వాలని 2024 నవంబర్‌లో కాంగ్రెస్ కార్యకర్త ఆర్టీఐ పిటిషన్లో కోరారు. ఆగస్టు 2016 నుంచి డిసెంబర్ 2023 వరకు డిజిటల్ మీడియా విభాగానికి ప్రభుత్వం పెట్టిన ఖర్చు సుమారు రూ.18 కోట్లు అని తెలంగాణ ఐటీశాఖ జవాబు ఇచ్చింది. డిజిటల్ మీడియా విభాగం చేసిన అన్ని పనులకు చెల్లించిన సొమ్ము, జీతభత్యాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపితే సుమారు రూ.18 కోట్లు. కానీ, ఎలాంటి సంబంధం లేని అధికారిక విదేశీ పర్యటనలకు, డిజిటల్ మీడియా మొత్తం ఖర్చుకు లింక్ పెట్టి కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఆర్టీఐ పిటిషనర్‌కు ఇచ్చిన సమాధానంలో దిలీప్ విదేశీ పర్యటనల ఖర్చును డిజిటల్ మీడియా వింగ్ భరించలేదని స్పష్టంగా ఉన్నది. కానీ, కొన్ని పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు వార్తను ప్రచురించాయి. ఓ పత్రిక అయితే, ఒక్క బ్రిటన్ పర్యటనకే రూ.13.85 కోట్లు దిలీప్ ఖర్చు చేసినట్టు, వాస్తవాన్ని నిర్ధారించుకోకుండా కథనం అచ్చేసింది.
డిజిటల్ మీడియా విభాగానికి 2023లో అత్యధిక మొత్తం ఖర్చు కావడానికి ప్రత్యేక కారణం ఉన్నది. మే 2023లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అప్పటి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా వివిధ శాఖలు పదేండ్లలో సాధించిన విజయాలను ప్రధాన స్రవంతి మీడియా, డిజిటల్ మీడియాల్లో విసృ్తతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ మీడియా విభాగం నుంచి ప్రత్యేక వీడియోల రూపకల్పన, వెబ్సైట్, మొబైల్ యాప్, ఇంకా డిజిటల్ మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వడం, డజన్ల కొద్దీ ప్రత్యేక వీడియోలు, డాక్యుమెంటరీలు రూపొందించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాలశాఖ ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించింది. అందువల్లే 2023లో డిజిటల్ మీడియా విభాగానికి అధిక నిధులు ఖర్చయ్యాయి. ‘ఈ దశాబ్ది ఉత్సవాల నిధుల విడుదల, వ్యయానికి సంబంధించిన అన్ని ఫైళ్ల పరిశీలన, ఆమోదం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో జరిగాయి. సదరు నిధుల వినియోగం గురించి ఈ ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించినా ఎదురోవడానికి నేను సిద్ధమే’ అని కొణతం దిలీప్ ఆ ప్రకటనలో స్పష్టంచేశారు.
శ్రీరాం కర్రిని ఏ హోదాలో తీసుకెళ్లారు?
జనవరి 2024లో సీఎం రేవంత్‌రెడ్డి తన వెంట ఎటువంటి ప్రభుత్వ హోదా లేని శ్రీరాం కర్రి అనే వ్యక్తిని ప్రభుత్వ సొమ్ముతో దావోస్తోపాటు ఇంకో మూడు దేశాలకు ఎందుకు తీసుకువెళ్లారు? అని ఒక పౌరుడు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు 14 నెలలు గడిచినా సమాధానం రాలేదు. ఆనాటికి ఒక ప్రైవేటు వ్యక్తి అయిన శ్రీరాం కర్రిని ఎందుకు ప్రభుత్వ ఖర్చుతో నాలుగు దేశాలు తిప్పారు? ఏం దాచటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది? పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం డిజిటల్ మీడియాకు ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు ఖర్చు కేవలం ఏడాదిన్నరలో రేవంత్ ప్రభుత్వం ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.