హైదరాబాద్/సిటీబ్యూరో సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను గురువారం ఉదయం నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అంతకుముందు పెద్ద హైడ్రా మా నడిచింది. దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవన్లో నిర్బంధించారు.
ఆయన కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత లు జగదీశ్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, పీ కార్తీక్‌రెడ్డి, క్రిశాంక్ సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు సీసీఎస్‌కు చేరుకున్నారు. దిలీప్‌ను ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు.
పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోగా దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దిలీప్‌ను విడుదల చేసేంత వరకు అక్కడే ఉంటామంటూ నిరసనకు దిగారు. దీంతో సీసీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, దిలీప్‌ను ప్రశ్నించిన పోలీసులు అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తారని అందరూ భావించారు.
అయితే, దిలీప్ నిర్బంధంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన పోలీసులు అనూహ్యంగా 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. కాగా, సీసీఎస్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం సహా అక్కడి తతంగాన్ని తన చిత్రీకరిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త నుంచి పోలీసులు సెల్‌ఫోన్ లాక్కున్నారు.
ఆసిఫాబాద్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తెలుగు స్ర్కైబ్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశారని, అవి మత కలహాలను రెచ్చగొట్టేలా ఉండడంతో సుమోటోగా తీసుకుని దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తెలుగు స్ర్కైబ్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ఆయన నిర్వహిస్తున్నట్టు తెలిసి నిర్బంధంలోకి తీసుకున్నట్టు చెప్పారు.
కొణతం దిలీప్ అరెస్టును నిరసిస్తూ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు జగదీశ్‌రెడ్డి, బాల్క సుమన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి తదితరులు
దిలీప్‌ను పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడంపై అంతకుముందు మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవరి ఫిర్యాదు ఆధారంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే పోలీసులతో దౌర్జన్యానికి దిగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై సీఎం, మంత్రులు నిద్రావస్థలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, అలాంటి వాటిని కట్టడి చేసేందుకే ఈ తరహా నిర్బంధాలకు దిగుతున్నారని ఆరోపించారు. పోలీసులపై ఆధారపడి బతకాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మాట్లాడితే ప్రజా ప్రభుత్వమంటున్నారని, కానీ ఇది పోలీసు రాజ్యమని విమర్శించారు. ఏ కారణం లేకుండా దిలీప్‌ను నిర్బంధించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దిలీప్‌ను ఏ ఆధారంతో నిర్బంధంలోకి తీసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే చూపించాలని కోరారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడనివ్వకుండా గంటలపాటు నిర్బంధంలో పెట్టడం ఏంటని నిలదీశారు. తెలుగు స్ర్కైబ్ ట్విట్టర్ హ్యాండిల్‌కు, దిలీప్‌కు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. మతకల్లోలాలను బీఆర్ఎస్ ఎన్నడూ ప్రమోట్ చేయలేదని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం బహిరంగంగానే ఆ పనిచేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఐటీసెల్‌కు దిలీప్ అపాయింట్ అయినట్టు లెటర్ ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలతోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. మతం పేరుతో చిచ్చు పెడుతున్న వారిని మాత్రం ముట్టుకోవడం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చేతకానితనాన్ని దిలీప్ కొంతకాలంగా ప్రశ్నిస్తుండడంతోనే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని చూసినందుకు కొన్ని రోజుల క్రితం హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతు నొకడమేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు. అక్రమ నిర్బంధాలతో పాలన కొనసాగించాలనుకోవడం భ్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు. 9 నెలలుగా రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రం లేదని విమర్శించారు.
కొణతం దిలీప్ అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో కొనసాగుతున్న నిరంకుశత్వానికి ఇది నిదర్శనం. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా? కక్షపూరిత, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదు.
– హరీశ్‌రావు
పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొకుతున్నది. 9 నెలల పాలనతో తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేసింది. రాష్ట్రంలో అప్రకటిత నిర్భంధం కొనసాగుతున్నది.
– నిరంజన్ రెడ్డి
దిలీప్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిర్బంధంలోకి తీసుకోవడం అమానుషం. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నయ్. ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటం.
– దేవీ ప్రసాద్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతున్న దిలీప్‌ను నిర్బంధించడం అక్రమం. కేసు వివరాలు కూడా చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించే గొంతును ప్రభుత్వం నొక్కుతున్నది. ఇది ప్రజాపాలన కాదు.. నిరంకుశ పాలన.
-పల్లె రవికుమార్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్
ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎత్తిచూపితే నిర్బంధించేస్తారా? ఇలాంటి వాటితో ప్రశ్నించే గొంతులు నొక్కలేరు.
-దూదిమెట్ల బాలరాజు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి
దిలీప్ చేసిన నేరం ఏమిటో ప్రభుత్వం చెప్పాలి. ప్రజల పక్షాన ప్రశ్నించిన వారిని ప్రభుత్వం వేధిస్తున్నది. దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం.
– అనిల్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపుతున్న దిలీప్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టింది. ఎలాంటి కారణం లేకుండా అయనను నిర్బంధించింది.రేవంత్ పాలనలో ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లో కాకుండా రేవంత్ కార్యాలయంలో తయారవుతున్నాయి.
-పడాల సతీశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు