హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి వ్యతిరేకం గా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై అక్రమ కేసులు బనాయించి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని అ వమానపరిచేలా కామెంట్లు పోస్టు చేశారని ఆదర్శనగర్‌కు చెందిన సంజీవరెడ్డి ఇచ్చిన ఫి ర్యాదుపై పోలీసులు క్రైం నంబర్ 2317/ 2024తో 67 ఐటీ యాక్ట్ 2008, బీఎన్ఎస్ కింద 353(1)(బీ), 353(2), 352, 193,196 సెక్షన్ల కింద, సెప్టెంబర్ 28న కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లలో గరిష్ఠంగా ఐ దేండ్ల కంటే ఎక్కువ శిక్షలు లేవు.
ఈ సెక్షన్లతో వెళ్తే కోర్టు రిమాండ్‌ను తిరస్కరిస్తూ, 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని సూచించే అవకాశాలుండడంతో పోలీసులు కొత్తగా 336(4) ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ, 61(2)(ఎ) కుట్ర, 111(బీ) అర్గనైజ్డ్ క్రైమ్‌ల కింద వచ్చే సెక్షన్లను జోడించారు. నేరం రుజువైతే ఫోర్జరీకి అత్యధికంగా ఏడేండ్లు, కుట్ర కేసులో ఉరిశిక్ష, జీవితఖైదు పడే అవకాశాలు ఉంటాయి. నాంపల్లి కోర్టులో దిలీప్‌కు రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇది కుట్ర అని ఉద్దేశపూర్వకంగా జైలుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని, గత కేసుపై స్టే ఉన్నా అరెస్ట్ చేశారని దిలీప్ తరపు న్యాయవాదులు వాదించడంతో న్యాయస్థానం దిలీప్ రిమాండ్‌ను తిరిస్కరిస్తూ, 41 సీఆర్పీసీ నోటీసులిచ్చి పంపాలని సూచించింది.