కోనరావుపేట, సెప్టెంబర్ 21: దుబాయ్‌లో ఓ హత్య కేసులో 17 ఏండ్లుగా జైల్లో మగ్గుతున్న యువకుడికి మంత్రి కేటీఆర్ కృషితో ఎట్టేకేలకు విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతులు సంచారజాతి(ఒడ్డెర)కి చెందినవారు. వీరి కుమారుడు లక్ష్మణ్‌కు 36 ఏండ్లప్పుడు 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ నేపాలీ సెక్యూరిటీ హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనితోపాటు సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశ్, గొల్లెం నాంపల్లి, శివరాత్రి హనుమంతు శిక్ష అనుభవిస్తున్నారు.
బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపి మంత్రి కేటీఆర్ నగదు పరిహారంగా ఇచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా అక్కడి ప్రభుత్వం శిక్షను యథావిధిగా కొనసాగిస్తున్నది. ఇటీవల దుబాయ్ వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. క్షమాభిక్ష కోసం దుబాయిలోని భారత కాన్సులేట్ అధికారులతోపాటు, అక్క డి అధికారులతో చర్చించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్ అనారోగ్యం రీత్యా.. న్యాయవాది అభ్యర్థన మేరకు కోర్టు అతని విడుదలకు ఆమోదం తెలిపింది. మిగిలిన నలుగురిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కేటీఆర్ మా ఇంటి దేవుడు
17 ఏండ్ల కింద ఇల్లు విడిచి వెళ్లిన నా కొడుకు ఇంటికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నా భర్త నర్సయ్య కొడుకు మీద రందితో చనిపోయిండు. నేను కూడా పాణం బాగలేక దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్నా. నా కొడుకు ఇక రాడని అతని భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. ఎవరూ లేక దుబాయ్‌లోనే నా కొడుకు ఉండిపోతడు అనుకున్న. కేటీఆర్ సారు పైసలు కట్టి ఇంటికి రప్పిస్తున్నడని ఇయ్యాలనే తెలిసింది. కేటీఆర్ సారు మా కుటుంబానికి దేవుడు.
-లస్మవ్వ, బాధితుడి తల్లి