సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల (Mallanna Jathara) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించిన అర్చకులు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను పట్టుకుని అగ్నిగుండాలు దాటిన తర్వాత.. భక్తులు అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్నారు. అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దీంతో మూడు నెలలుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండాల ప్రవేశంతో ముగింపు పలికినట్లయింది.
భక్తుల కొంగుబంగారమై కొమురవెల్లి బల్లన్న బ్రహ్మోత్సవాలు జనవరి 19న ప్రారంభమయ్యాయి. మూడు నెలలపాటు సాగిన జాతర.. ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించుకున్నారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగాయి. 12 ఆదివారాలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.