హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ‘మానసికంగా నన్ను ఇ బ్బంది పెట్టాలనుకుంటే ఒకేసారి ఇంత ఇషమిచ్చి చంపేయండి. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయా. ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. నాలాంటి వాడిని ఏడిపిస్తా అంటే ఏడిపించండి. నన్ను అవమానించి ఏం సాధిస్తారు? నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు’ అని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం, మంత్రులపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు.‘ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఎంతో కష్టపడాలి. ఐఏఎస్ అధికారులకు సెలవులు ఉండవు. వారి బదిలీలు సర్వ సాధారణం. మీకు(విలేకరులు) కూడా కుటుంబాలు ఉంటాయి. మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించుకోండి’ అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు,ప్రతి విమర్శలు సర్వసాధారణమని,ఐఏఎస్ అధికారులకు కూడా కుటుంబాలు ఉంటాయని, వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హితవుపలికారు.
మహిళలను ఇబ్బందులు పెట్టి ఏం సాధిస్తరు?
‘మహిళలు ఉద్యోగాలు చేయడమే తప్పా? మంత్రుల ఇండ్లల్లో ఇబ్బందులు కలిగించి ఏమి సాధిస్తారు? ఫోన్ మాట్లాడకపోతే, ఫోన్ ఎత్తకపోతే అసత్య వార్తలు రాస్తారా? ఫోన్ మాట్లాడుకుంటూపోతే అధికారులతో సమీక్షలు ఎప్పుడు చేయాలి? ఎవరైనా బాధపడితే స్పందించే గుణం నాది’ అని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజమని తెలిపారు. కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీలు ఎలా తట్టుకుంటాయని ప్రశ్నించారు.
చట్టపరంగా చర్యలు
సీఎం, మంత్రులను అప్రతిష్ఠపాలు చేసేలా మీడియాలో వస్తున్న కథనాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి చెప్పారు. డీజీపీతోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌తో మాట్లాడి, కథనాలపై నివేదిక కోరినట్టు తెలిపారు. మహిళా అధికారుల మీద మీడియాలో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్ల బదిలీలు సీఎం పరిధిలో ఉంటాయని, వాటితో మంత్రులకు సంబంధం ఉండదని తెలిపారు. ‘అన్ని మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు వార్తలు రాయడం సరికాదు. ఓ ఇన్చార్జి మంత్రి మీద కూడా వార్తలు రాస్తున్నా రు. ఇప్పుడు నల్లగొండ మంత్రి అని తప్పుడు వార్తలు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’ అని మంత్రి పేర్కొన్నారు.
ట్రాఫిక్ జామైతే నో టోల్
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వె ళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్టు కోమటిరెడ్డి తెలిపారు. విజయవాడ వెళ్లే దారిలోని పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని, అకడ టోల్గేట్ ఓపెన్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి దాదాపు 12 లక్షలు వాహనాలు ఊర్లకు వెళ్తాయని చెప్పారు. నిరుడు సంక్రాంతికి 9 లక్షల వాహనాలు వెళ్లి వచ్చాయని వివరించారు. మరమ్మతుతో ఆగిపోయిన వాహనాలను క్రేన్స్ సాయంతో కదిలించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు, అత్యవసర సమయాల కోసం 1033 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రతి 20 కిలోమీటర్లకూ ఒకటి చొప్పున అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్ట్ వరకు ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ హైవేకు డీపీఆర్ సిద్ధమైందని, త్వరలో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.