Rajalinga Murthy Murder | హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగినట్టు తెలుసు.. మృతుడి భార్య ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయమూ విదితమే.. భూతగాదాలే హత్యకు కారణమని స్వయంగా డీఎస్పీ చెప్పిన విషయమూ బహిరంగమే.. హత్యకు సంబంధించి వాస్తవాలన్నీ తెలుసు.. కానీ రాజకీయం చేయాలి.. బీఆర్ఎస్ను బ ద్నాం చేయాలి.. ఇదీ అధికార కాంగ్రెస్ నేతల కుట్రలు, కుతంత్రాలు. పాలనలో విఫలమైందనే విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెగబడుతున్నది.
భూతగాదాల నేపథ్యంలో జరిగిన రాజలింగమూర్తి హత్యను రాజకీయం చేస్తున్నది. ఈ హత్యను బీఆర్ఎస్పైకి నెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు లక్ష్యంగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే మంత్రులు మొదలు సీపీఆర్వో ఆఫీసు వరకు అంతా కలిసి మీడియాకు తప్పుడు సమాచారం అందిస్తూ లీకులు ఇస్తున్నట్టుగా తెలుస్తున్నది. సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
గురువారం జరిగిన ఓ మీడియా సమావేశంలో స్వయంగా ముగ్గురు మంత్రులు నిస్సిగ్గుగా హత్యా రాజకీయాలకు పాల్పడడం గమనార్హం. రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్కు ఆపాదించేలా కథనాలు రాయాలనే విధంగా విలేకరులకు సూచించడం గమనార్హం. ‘రాజలింగమూర్తి హత్యపై మీరంతా దృష్టిపెట్టాలి. ఇందులో కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టు ఆ కుటుంబమే చెప్తున్నది.’ అంటూ పరోక్షంగా సంకేతాలివ్వడం గమనార్హం. సుమారు 25 నుంచి 30 మంది విలేకరులు ఉన్న సమావేశంలోనే బహిరంగం గా మంత్రులు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే సదరు మంత్రులు, ప్రభుత్వం ఈ హత్యను బీఆర్ఎస్పైకి నెట్టేందుకు ముందుస్తు ప్లాన్‌తో ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజాలు ప్రపంచానికి తెలిసేలోగా ఎలాగైనా సరే రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్కు అంటగట్టాలనే కుతంత్రంతో కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి తెరతీసింది. హత్య జరిగిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఈ హత్యను బీఆర్ఎస్కు ఆపాదించేలా అటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఓ ప్రభుత్వ ఉద్యోగి విలేకరులు ఉన్న వివిధ వాట్సప్ గ్రూపుల్లో ఏకంగా పోస్టులనే పెట్టారు.
బీఆర్ఎస్ హత్య చేయించిందనే విధంగా ప్రచారంచేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సైతం బీఆర్ఎస్పై నెపం నెట్టే ప్రయత్నంచేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో అయితే హద్దు, అదుపు లేకుండా అసత్య ప్రచారాన్ని వ్యాప్తిచేశారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు ఇలా అంతా మూకుమ్మడి దాడికి దిగారు.
నిజాలకు పాతరేసి పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి సీపీఆర్వో ఆఫీసు కూడా రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఈ హత్యకు సంబంధించి వివిధ మీడియా చానళ్లకు, పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడిగడ్డ కేసును బూ చిగా చూపుతూ రాజలింగమూర్తి హత్యలో బీఆర్ఎస్ను ముద్దాయిగా నిలిపే విధంగా కథనాలు రాయాలని సూచించినట్టుగా తెలిసింది.
ఇందులో భాగంగానే గురువారం వివిధ పత్రికలు, చానళ్లలో తాటికాయంత అక్షరాలతో తప్పుడు కథనాలను వండివార్చారు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కథనాలు రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా రాజలింగమూర్తి హత్యకేసులో బీఆర్ఎస్ను ముద్దాయిగా నిలిపేందుకు తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా తప్పుడు ప్రచారానికి పూనుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలకు గురయ్యారు. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ అసత్యాలు చెప్పి తన స్థాయిని తగ్గించుకున్నారనే విమర్శలు వచ్చాయి. కనీస సమాచారం తెలుసుకోకుండా, నిజానిజాలు బేరీజు వేసుకోకుండా ఓ చిన్న కార్యకర్తలా మంత్రి ఇష్టారీతిగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ హత్యను ఏ విధంగానైనా బీఆర్ఎస్కు ఆపాదించాలనే కుతూహలంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకాకుండా మాట్లాడారంటూ జనం విస్తుపోతున్నారు.
ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడడాని కంటే ముందే మృతిడి భార్య ఐదుగురి వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. అప్పటికే పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మాత్రం ఈ నిజం తెలియలేదు. ఈ హత్య విషయం తెలియగానే తమ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. అంటే ఓ మంత్రి ఫోన్ చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేనే స్పందించని దౌర్భాగ్యం ఉండటం గమనార్హం. ఒక మంత్రిగా స్థానిక ఎస్సైకి, డీఎస్పీకి, ఎస్పీకి ఫోన్ చేస్తే అసలు నిజాలు చెప్పేవారు కదా… ఆ మాత్రం కూడా మంత్రికి తెలియదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా మంత్రి కోమటిరెడ్డి తన స్థాయిని మరిచి అబద్ధాలను మాట్లాడుతూ బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. ఆ ఘటనకు సంబంధించి రేణుకుంట్ల కుటుంబానికి చెందిన ఇద్దరిని పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. హత్య జరిగిన స్థలంలో గురువారం క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఘటనా స్థలం వద్ద సంచిలో ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వారి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు కాల్‌డేటాతో విచారణను ముమ్మరం చేశారు.
ఎస్ఐ ఏం చెప్పారు
భూమికి సంబంధించి 10 ఏండ్లుగా వివాదం ఉన్నది. ఇందులో భాగంగానే రాజలింగమూర్తి హత్య జరిగినట్టు ఫిర్యాదు అందింది.’ ఇదీ భూపాలపల్లి ఎస్సై చెప్పిన మాట.
‘భూమికి సంబంధించి రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబంతో తగాదా నడుస్తున్నది. అందుకే బైక్‌పై వెళ్తున్న నా భర్తను అడ్డుకొని రేణుకుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మోరె కుమార్, కొత్తూరి కుమార్, కొమురయ్య అనే వ్యక్తులు హత్య చేశారు’ ఇదీ మృతుడు రాజలింగమూర్తి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు. ఈ మేరకు పైఐదుగురిపై భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు పలువురు బీఆర్ఎస్ నేతలపై నెపం నెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే మేడిగడ్డపై కేసు వేశారనే కోపంతో బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారంటూ అసత్య ప్రచారానికి తెగబడ్డారు.