Komatireddy Venkat Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ‘ఫార్మాసిటీ ఉంటే ఆదిబట్ల ఉంటదా? తట్టాబుట్టా సర్దుకొని ఉన్న ఎకరం అమ్ముకొని పోతవు నువ్వు. ఎయిర్‌పోర్టు కాదు.. తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఖాళీ అవుతయ్. 14 వేల ఎకరాల్లో పది వేల పరిశ్రమలు వస్తే ఆ రోగాలకు ఉంటమా మనం? మేం ఇచ్చిన మాటకు కట్టుబడ్డం. అందుకే ఈరోజు ఫార్మాసిటీ లేకుండా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, అమెజాన్ డాటా సెంటర్ పెడ్తున్నం… మేం చెప్పిన మాటకు నిలబడ్డమా.. లేదా? ఫార్మాసిటీ అనేది ప్రజలు లేని ప్రాంతాల్లో ఉండాలి.
ఎవరెన్ని అన్నా.. మేం వచ్చిన మూడు రోజులకే నిర్ణయం తీసుకున్నం…’ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్లలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రజలనుద్దేశించి ఫార్మాసిటీ రద్దు నిర్ణయం ఇప్పటికే తీసుకున్నట్టు ఆయన బహిరంగంగా ప్రకటించారు. కానీ, నిబంధనల ప్రకారం ఫార్మాసిటీ రద్దు అయినందున రైతుల నుంచి సేకరించిన భూముల్ని తిరిగి వారికి ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటున్నది. అంతేకాదు, అసలు ఫార్మాసిటీని రద్దు చేయలేదని, అక్కడే ఏర్పాటు చేస్తున్నామంటూ హైకోర్టులో అధికారికంగా అఫిడవిట్ సమర్పించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తున్న తీరు మంత్రుల ప్రకటనల రూపంలో మరోసారి బహిర్గతమైంది. దీంతో హస్తం ప్రభుత్వంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
పూటకో మాట.. రోజుకో నిర్ణయం.. హైకోర్టుకు చెప్పేదొకటి.. ప్రజలకు చెప్పేది మరొకటి.. ముఖ్యమంత్రి ఒకటంటే.. మంత్రులు ఇంకొకటంటరు.. ఇదీ ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆడుతున్న డ్రామా. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ ఏర్పాటుపై రేవంత్ సర్కారు దోబూచులాడుతున్నది.
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం రెండు నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం 14 వేల ఎకరాలకు పైగా భూముల్ని సేకరించింది. భూములు కోల్పోయిన రైతులకు సంతృప్తికరంగా నష్టపరిహారం ఇవ్వడంతో పాటు అభివృద్ధి చేసిన లేఅవుట్లో వారికి ఎకరానికి 121 చదరపు గజాల చొప్పున ప్లాట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల పరిధిలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
కానీ, 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూడు రోజులకే ఫార్మాసిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడంతోపాటు భట్టి మొదలు ఇప్పుడు మంత్రులుగా ఉన్న చాలామంది కాంగ్రెస్ నేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని రైతులు కోరుతుంటే మాత్రం కనీసం వారికి సమయం ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా తమ డిమాండ్లను వినిపించేందుకు అనుమతులు కూడా ఇవ్వకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే ఫార్మాసిటీ రద్దు నిర్ణయం తీసుకున్నది వాస్తవం. ఈ మేరకు సీఎంవో నుంచే పత్రికా ప్రకటన విడుదలైంది. కానీ, రోజుల వ్యవధిలోనే మాట మార్చి.. ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని చెప్పారు. ఈ మేరకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భిన్నమైన ప్రకటనలు చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు అక్కడే వివిధ రకాల ఫార్మాయేతర కంపెనీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో భూసేకరణ సమయంలో ‘ఫార్మాసిటీ కోసమే భూముల్ని సేకరిస్తున్నాం’ అనే నిబంధన ఉన్నందున, ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దు చేసినందున తమ భూములు తమకు వస్తాయని రైతులు ఆశగా ఎదురుచూశారు.
కానీ, ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతుండటంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రైతులకు భూములు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం మరోసారి మాట మార్చింది. లేదు.. లేదు.. అక్కడే ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామంటూ హైకోర్టులో అధికారికంగా సమర్పించిన అఫిడవిట్లో హామీ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేశామంటూ మరోమారు మంత్రులే ప్రకటనలు చేస్తున్నారు. పైగా ఫార్మా కోసం సేకరించిన భూముల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక కంపెనీలకు భూ కేటాయింపులు కూడా చేపడుతున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.