నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ భూబాధితుల ఆగ్రహాన్ని చల్లార్చే దిశగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దక్షిణభాగం విషయంలో ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం డీపీఆర్ మాత్రమే సిద్ధమైందని, డిసెంబర్లో అలైన్మెంట్ అవుతుందని, రైతులకు అన్యాయం జరిగితే తానే ఊరుకోనంటూ ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కోమటిరెడ్డి ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ స్థానిక నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ట్రిపుల్ ఆర్ ప్రాంత గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని, వారిని చల్లబరిచేలా ప్రకటన చేయకపోతే ఎన్నికల్లో ఓటర్ల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలానికి చెందిన కాంగ్రెస్, సీపీఐ ముఖ్య నేతలు కొందరు తమతోపాటు ఉండే కొందరు బాధిత రైతులను తీసుకుని నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోని ఓ హోటల్ వద్దకు వచ్చారు.
అదే సమయంలో అదే హోటల్ వద్ద కోమటిరెడ్డి మాట్లాడతారని స్థానిక కాంగ్రెస్ నేతలు మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తుంగతుర్తిలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన కోమటిరెడ్డి అక్కడి నుంచి హుటాహుటిన బాధిత రైతులు ఉన్న హోటల్ వద్దకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేరుకున్నారు. ముందు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ నేతలతోపాటు కొందరు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ వల్ల రైతులకు అన్యాయం జరగదని చెప్పుకొచ్చారు.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి డిసెంబర్ నాటికి టెండర్లు పూర్తి చేస్తామని, జనవరిలో పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. తాను మంత్రి అయిన తరువాత రైతులను ఒప్పించి 98 శాతం భూసేకరణ పూర్తి చేశానని, మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇప్పించినట్టు చెప్పుకొచ్చారు. 2035 నాటికి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు లేన్ల రోడ్డును 6 లేన్లుగా మార్చినట్టు వివరించారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 161.518 కిలోమీటర్ల మేర ఉత్తరభాగం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3వేల కోట్ల హడ్కో రుణం తెచ్చినట్టుతెలిపారు.