హైదరాబాద్: రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించుకోవడాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.’ అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ట్వీట్ చేశారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025
మరో పదేండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి తరచూ ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన తరచూ ఇలాంటి వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. తనదారి తాను చూసుకుంటానని ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని తానేనంటూ చేసిన వ్యాఖ్యలపై ఫైర్అయ్యారు.
20 ఏండ్లు నేనే సీఎం
‘కేసీఆర్ నీ గుండెల మీద రాసుకో.. 2024 నుంచి 2034 వరకు పాలమూరు బిడ్డ.. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు..పాలమూరు నుంచి ప్రజాప్రభుత్వాన్ని నడుపుతాడు.. పాలమూరు నుంచి శాసనం చేస్తా.. పాలమూరు నుంచి శాసనసభలు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా..ఇది నా మాట.. నువ్వు నీ గుండెల్లో రాసుకో’ అంటూ శుక్రవారం కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభ వేదిగకగా రేవంత్రెడ్డి పగటి కలలుకన్నారు.