హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేసి.. తనలో ఇన్నాళ్లు దాగి ఉన్న ఆవేశాన్ని వెళ్లగక్కారు. తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందన్నారు. సోనియాను 20 ఏండ్ల పాటు తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుడిని చేశారు. సోనియా అంటే ఎంతో గౌరవమున్న తాము.. రేవంత్ కింద పని చేయాలా? అని ప్రశ్నించారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధిగా పని చేసిన తాము.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తి కింద పని చేయలేమని తేల్చిచెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తిని సీఎం చేయాలా? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ తన మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది. తాను ఏం తప్పు చేశాను అని అడిగారు. ఏ చర్చకైనా సిద్ధమని తేల్చిచెప్పారు. అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా బలహీన పడిందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కమిటీలు వేసినప్పుడు కూడా కనీసం తనను సంప్రదించలేదు. కాంగ్రెస్ పార్టీలో తనను ఘోరంగా అవమానించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను. అవమానాలు భరించలేకనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.