హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్ఠానం హామీ ఇచ్చిన మాట నిజమేనని, అధిష్ఠానం పెద్దలతో జరిగిన చర్చల్లో తాను కూడా పాల్గొన్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఆదివారం ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వ్యవహారంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. భట్టి మాట్లాడిన వీడియోను రాజగోపాల్‌రెడ్డి అనుచరులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు, రాజగోపాల్‌కు మంత్రి పదవి హామీ అంశాన్ని భట్టి బట్టబయలు చేయడంపై సీఎం రేవంత్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంతో తలబొప్పి కడుతుండగా, భట్టి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయని అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆవిధంగా మాట్లాడారని అనుమానిస్తున్నారు. ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చిత్రవిచిత్రంగా సమాధానాలు ఇచ్చారు భట్టి విక్రమార్క. పింఛన్లు పెంచారా? అంటే అది తప్ప.. ఆడపిల్లలకు స్కూటర్లు అందజేస్తున్నారా? అంటే అది తప్ప? అంటూ జవాబులు చెప్పారు.