హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలతోపాటు సమీప రాష్ట్రాలను కలిపే 15 ముఖ్యమైన రోడ్లను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. వీటిలో తొలుత 780 కి.మీ. పొడవైన 6 రోడ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్-ఘట్కేసర్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చాలా కాలం నుంచి నత్తనడకన సాగుతున్నట్టు తెలిపారు. ఈ అంశాలపై గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీతో చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డుపై సమగ్ర సమాచారంతో కూడిన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కేంద్ర మంత్రికి సమర్పించారు.
సమావేశానంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత కింద 6 రోడ్లను అప్‌గ్రేడ్ చేయాలని గడ్కరీని కోరినట్టు తెలిపారు. వీటిలో చౌటుప్పల్-ఆమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి (182 కి.మీ.), మరికల్- నారాయణపేట-రామ సముద్రం (63కి.మీ.), పెద్దపల్లి-కాటారం (66 కి.మీ.), పుల్లూరు-ఆలంపూర్-జెటప్రోల్-పెంట్లవెల్లి-కొల్లాపూర్-మల్లెపల్లి-నల్లగొండ(225 కి.మీ.), వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ-వికారాబాద్-తాండూర్ -జహీరాబాద్-బీదర్ (134 కి.మీ.) రోడ్లు ఉన్నట్టు వివరించారు.
భారత్ మాలా పథకం మొదటి దశలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం (సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-చౌటుప్పల్) నిర్మాణ పనులకు మాత్రమే కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని కూడా త్వరగా నిర్మించాల్సి ఉన్నందున ఆ భాగానికి కూడా జాతీయ రహదారిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. నల్లగొండ టౌన్ బైపాస్ (15.2 కి.మీ) రోడ్డు డీపీఆర్‌ను ఇదివరకే సమర్పించామని, రూ.700 కోట్ల విలువైన ఈ పనులను కూడా వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
నల్లగొండ-నకిరేకల్ రహదారి అభివృద్ధితోపాటు నల్లగొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం, స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటు కోసం డీపీఆర్ సమర్పించినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన అన్ని రోడ్లను హైవేలుగా మారుస్తామని గడరీ హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 11న తెలంగాణకు రావాలని ఆయనను కోరినట్టు చెప్పారు. గడ్కరీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డితోపాటు తాండూర్ ఎమ్మెల్యే బీ మనోహర్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, కేంద్ర రోడ్లు, జాతీయ రహాదారుల విభాగం అదనపు సంచాలకుడు ధర్మేంద్ర సారంగి, రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.