హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది. అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న అభిమానంతో పోటీపడి నువ్వానేనా చూసుకుందామని జబ్బలు చరిచిన రాజగోపాల్‌రెడ్డి.. చివరికి అవమానభారంతో వెనుతిరగాల్సి వచ్చింది. తమ్ముడినే నమ్ముకొని, ఆయన వెంట బీజేపీలోకి చేరుతానంటూ లీకులిచ్చి ప్రచారానికి కూడా దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అటు సొంత పార్టీలోనూ పరువు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇద్దరిపైనా ‘కోవర్ట్ రెడ్డి’ బ్రదర్స్ అనే అవమానకర ముద్ర పడింది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ వీరిని నమ్మే పరిస్థితి లేదు.
రాజీనామాతో మొదలు
గందరగోళ పరిస్థితుల్లోనే రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రభుత్వం పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ సమానంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నది. కానీ, ఆగమాగం అయిన రాజగోపాల్‌రెడ్డి.. తాను రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పైగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేంత వరకూ రెండు, మూడు పార్టీల్లో చేరుతున్నారనే వార్తలు వినపడుతూనే వచ్చాయి. చివరికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును దక్కించుకొని బీజేపీలో చేరడంతో ప్రజల్లో ఆయనపై విముఖత వ్యక్తమయ్యింది. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయనను నిలదీశారు. ప్రతిచోటా ఆయనకు చుక్కెదురయ్యింది. అనుకున్నట్టుగానే చివరికి రాజగోపాల్ అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. పోటీ చేస్తే ప్రజలు తగిన శాస్తి చేశారని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి.
పాలుపోని స్థితిలో వెంకట్‌రెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ్ముడితోపాటు పార్టీ మారడమా? తనను ఈ స్థాయికి చేర్చిన కాంగ్రెస్‌లోనే ఉండటమా? అనేది తేల్చుకోలేకపోయారు. ఇదే సందిగ్ధంతో తన తమ్ముడిని గెలిపించాలంటూ ఫోను ద్వారా పలువురు నేతలతో మాట్లాడిన ఆడియోలు బయటపడటంపై ప్రజలు, కాంగ్రెస్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారంలోకూడా పాల్గొనకుండా విదేశాలకు వెళ్లిపోయారు. దీనితో పార్టీ పెద్దల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. తమ్ముడు గెలిస్తే.. ఆయనతోపాటు బీజేపీలో వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. వచ్చిన ఫలితం మరోలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎవరూ నమ్మని పరిస్థితి.. అలా అని వేరే పార్టీలోకి వెళ్లలేని దుస్థితి. అన్న అండదండలు ఉంటాయని భావించిన తమ్ముడు.. తమ్ముడు గెలిస్తే పార్టీ మారుతాడనే సంకేతాలు పంపించిన అన్న.. ఇద్దరి ఆశలు మునుగోడులో గల్లంతయ్యాయి. నల్లగొండ ప్రాంతంలో పేరున్న నేతలైన ఇద్దరికీ కోవర్ట్ ముద్ర కచ్చితంగా అవమానమేనని విశ్లేషకులు చెప్తున్నారు.