Kollapur | కొల్లాపూర్, జులై 18 : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు భూమి పూజ చేసేందుకు వచ్చారు. కార్యక్రమం మొత్తం ఆత్మసుత్తి పరనిందగా నడిచింది. అంతేకాదు వేదికపై కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.
స్థానిక ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వరరావు పేరును ఉచ్చరించలేదు అలాగే గద్వాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సరితమ్మ పేరును కూడా ఉచ్చరించలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి జగదీశ్వరరావును అతని సేవలను సభా వేదికపై ప్రత్యేకంగా కొనియాడారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సమావేశానికి హాజరు కాకపోగా ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరును కూడా ముఖ్యులు ఉచ్చరించకపోవడం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతంగా చేసుకున్నట్లు కొంతమంది కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడారు.
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగం అంతా ఆత్మసుత్తి పరనిందగా కొనసాగింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఐదు సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి కొల్లాపూర్ నియోజక కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు ఫిల్టర్స్ లెవల్లోనే పనులు ఆగిపోవడానికి కారణమైన మంత్రి జూపల్లి సభా వేదికపై 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూములు నిర్మాణం జరగలేదని పేర్కొనడంతో అక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు కూడా అవాకయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తన తోటి మంత్రులు ఎమ్మెల్యేలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే జూపల్లి కృష్ణారావు ఎందుకు పూర్తి చేయలేకపోయారని చర్చించుకున్నారు.
ఎన్నికలలో గెలిచేందుకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని మహిళల ముంగిట చెప్పడంతో మహిళలు సైతం మంత్రి మాటలకు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒకవైపు 22 కోట్లు రుణమాఫీ చేశామని చెప్తూనే మరోవైపు పెంట్లవెల్లి మండల పరిధిలోని సొసైటీలోని 499 మంది రైతులకు రుణమాఫీ కాలేదని సీఎం దృష్టికి తీసుకొని వెళ్లడం కాంగ్రెస్ డొల్లతనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బయటపెట్టినట్లు అయింది. 98 జీవో ప్రకారం శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం, మాదాసి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయడం లాంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి తీసుకొని వెళ్ళిన 30 ఏళ్ల పాటు సమస్యలను బహిరంగ సభలపై ప్రసంగించడం వాటి కార్యసాధనకు పట్టించుకోకుండా ఉండడం పరిపాటిగానే జరుగుతుందని కొల్లాపూర్ ప్రాంత ప్రజలు చర్చించుకున్నారు. సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి ఏ మాత్రం సహకరించని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతుండడంతో క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకోవడం విస్మయానికి గురిచేస్తుంది.