హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధపు మాటలు ఆపి, నిజాలు మాట్లాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొల్లాపూర్ సంస్థానాధీశులకు చెందిన 1,600 ఎకరాల భూమిని కాపాడానని ప్రెస్మీట్లో పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆలయ, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఆయన, దొంగే.. దొంగా అన్న చందంగా వ్యవహరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత అభిలాష్ రంగినేనితో కలిసి ఆయన మాట్లాడారు. కొల్లాపూర్ సంస్థానాధీశులకు చెందిన 1,600 ఎకరాల భూమిని రక్షించింది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. 2021లో ఎమ్మెల్యేగా ఉన్న తాను కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు గుర్తుచేశారు.
కానీ జూపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాస్‌బుక్‌లు జారీ చేసింది వాస్తవంకాదా? బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ద్వారా పాస్ బుక్కులను రద్దు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. జూపల్లి రాజకీయ లబ్ధికోసం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘కొల్లాపూర్ వద్ద ఎల్లాపురంలో 44 ఎకరాల సీలింగ్ అటవీ భూములను రికార్డులు మార్చి విక్రయించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చెట్లను కొట్టి ప్లాట్లు పెట్టి అమ్ముకున్నారు. దేవాలయ భూములను కూడా తెగనమ్ముకున్నారు’అని సంచలన ఆరోపణలు చేశారు. స్థానికులు ఆయనపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. దమ్ముంటే కొల్లాపూర్‌లో భూ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోసారి తమపై అభాండాలు వేస్తే ఊరుకోబోమని, కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.