హైదరాబాద్ : సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా స్వతంత్ర సంస్థల ప్రతిష్టతను ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మసకబారుస్తోందని ఆయన విమర్శించారు.
దర్యాప్తు పేరుతో రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం బీజేపీ దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కవిత ఇంటిపై బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని కోలేటి దామోదర్ ఖండించారు. కేంద్రంపై పోరాడుతున్న సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కోలేటి దామోదర్ స్పష్టం చేశారు.