హైదరాబాద్, డిసెంబర్ 14 : ఉద్యమ పార్టీగా ఉద్భవించిన బీఆర్ఎస్(BRS) ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాభిమానంతో
పదేళ్లు సుస్థిరపాలన అందించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్(Koleti Damodar,) స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారానికి దూరమైనంత మాత్రనా కార్యకర్తలు నైరాశ్యానికి లోను కావద్దని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలతోనే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయన్న భావనతో తెలంగాణ ప్రజానీకం ఉన్నారన్నారు.
అయితే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజాభి మానం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుందనే విషయాన్ని కార్యకర్తలు గమనించాలని
దామోదర్ సూచించారు. నిరాశను విడనాడి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని దామోదర్ పిలుపు నిచ్చారు. కేసీఆర్ త్వరలోనే కోలుకుని ప్రజా క్షేత్రంలోకి వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు బీఆర్ ఎస్ పార్టీ నిరంతరం వాచ్ డాగ్‌లా పని చేస్తూనే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.