ఊట్కూర్, ఫిబ్రవరి 11 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేను రైతులు అడుగడుగునా అడ్డుకుంటున్న నేపథ్యంలో అధికారులు పోలీసులను భారీగా మోహరించి భూసేకరణ సర్వే చేపడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కాన్కుర్తి వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం మొదటి దశ పనులను ప్రారంభించింది. రెండు దశల్లో పనులు చేపట్టేందుకు సర్కారు నిర్ణయించి టెండర్‌ను మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించగా.. మూడు పంప్‌హౌస్‌లు, ఓపెన్ కెనాల్, పైపులైన్, విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూసేకరణ చేపట్టింది. వారం రోజులుగా రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. పొలాల్లో సర్వే చేపట్టేందుకు వస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను అడ్డుకొని తిప్పి పంపుతున్నారు.
వారి ఆందోళనను లెక్క చేయకుండా ప్రభుత్వం మంగళవారం ఊట్కూర్ మండ లం ఓబ్లాపూర్ శివారులో పోలీసులను భారీగా మోహరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నారాయణపేట డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతోపాటు 30 మందికిపైగా కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్ల మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే పూర్తి చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోగా ఊట్కూర్ మండలం బాపురం శివారులోని సర్వే నంబర్ 30లో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమికి తహసీల్దార్ చింత రవి దగ్గరుండి కొలతలు చేయించారు. సర్వే జరుగుతున్నంత సేపు తిప్రాస్‌పల్లి, బాపురం గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. అధికారులకు తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్న బాపురం రైతులను పోలీసులు శివారులోనే అడ్డుకున్నారు. భూములు తీసుకుంటే ఎలా బతకాలని ఆందోళన వ్యక్తంచేశారు. పరిహారం ఎంతిస్తారు? ఏంన్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని తహసీల్దార్ చింత రవి తెలిపారు.