Kodangal | కోస్గి, నవంబర్ 14: కొడంగల్ నియోజకర్గంలో కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని సర్జఖాన్‌పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ మూకలు రాళ్లదాడికి దిగాయి. బీఆర్ఎస్ నేతల వాహనాలను వారు ధ్వంసం చేశారు. ఈ గూండాయిజంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆ తరువాత శివాజీ చౌరస్తా వద్ద ధర్నా చేస్తుండగా.. ఆ అల్లరి మూకలు రెచ్చిపోయి మరోసారి రాళ్లదాడికి దిగారు.
రెండు సార్లు జరిగిన ఈ రాళ్ల దాడిలో మహిళలతోపాటు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్ నేతృత్వంలోనే ఈ దాడులు జరిగినట్టు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. బరితెగించిన కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతోనే తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి అనుచరులు 30 మంది మంగళవారం కోస్గి మండలంలోని సర్జఖాన్‌పేట్ గ్రామంలో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.
ఇంతలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరులైన కాంగ్రెస్ సర్పంచ్ హరీశ్‌గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, రాఘవేందర్‌గౌడ్, శెట్టి శివకుమార్, మద్దూర్ బాలు, ఉప సర్పంచ్ మూచ అశోక్, ఎండీ ఖాశీం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వాహనాల అద్దాలు పగిలిపోయాయి. దాడిని అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరువర్గాలను పంపించివేశారు.
బీఆర్ఎస్ నేత లు అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ పై దాడిన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అప్పుడే కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కోస్గి సీఐతో ఎమ్మెల్యే మాట్లాడి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి నిరసనగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మళ్లీ రాళ్లతో దాడి చేశారు. దీంతో పలువురు మహిళలతోపాటు కార్యకర్తలు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. వారిని వెంటనే దవాఖానకు తరలించారు.
రేవంత్‌రెడ్డి.. ఖబడ్దార్: పట్నం నరేందర్‌రెడ్డి
‘రేవంత్‌రెడ్డి ఖబడ్దార్.. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నావు.. మీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.. ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారు’ అని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కోస్గిలో మంగళవారం గులాబీ పార్టీ శ్రేణులపై హస్తం పార్టీ నేతలు దాడి చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాతో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు కండ్లు మండి దాడికి తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటమి ఖాయమని గ్రహించి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయజూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్‌కు ఘోర ఓటమి ఖాయమని చెప్పా రు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత తాను సీఎం అయితే మీ అంతు చూస్తానంటూ రేవంత్ మీడియాను హెచ్చరించడం సరికాదని అన్నారు.