కొడంగల్, డిసెంబరు 20 (నమస్తే తెలంగాణ) : కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన రైతుల నుంచి ప్రభుత్వం భూములు లాక్కునేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మా విలేజ్ అయినా, పారిశ్రామిక కారిడార్ అయినా భూములు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వం ఎన్ని కుట్రలు చేసినా భూమి ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. రోటిబండతండా వెళ్లిన బీఆర్ఎస్ లీగల్‌సెల్ నేతలు నర్సింహనాయక్, బీఆర్ఎస్వీ సంగారెడ్డి కోఆర్డినేటర్ రాజేంద్రనాయక్, గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌నాయక్ రైతులతో మాట్లాడారు. సీఎం రేవంత్ మూర్ఖత్వంతోనే రైతులకు సంకెళ్లు వేశారని నిప్పులుచెరిగారు. రైతులకు అండగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
జైలులో ఉన్నప్పుడు బాధతో నా భర్త హీర్యానాయక్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనకు బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్నప్పుడు కూడా నా భర్తను చూసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు.
నా కొడుకు పత్లావత్ శ్రీను లగచర్ల ఘటన జరిగిన రోజు కొత్త ఆటో రిజిస్ట్రేషన్ కోసం వికారాబాద్ ఆర్టీవో ఆఫీస్సు వెళ్లి సాయంత్రం వచ్చాడు. గొడవ సంగతి నా కొడుకుకు ఏమీ తెలియదు. అయినప్పటికీ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది.