Kodangal | మహబూబ్‌నగర్ ప్రతినిధి/కొడంగల్/పరిగి, నవంబర్ 12: అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం 16 మంది రైతులకు కోర్టుకు రిమాండ్ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, పరిగి సబ్ జై లుకు తరలించారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం అధికారులపై దాడి ఘటనపై ఆ అర్ధరాత్రి నుంచే ఇలా పోలీస్ యాక్షన్ షురూ అయింది. ఆ రాత్రంతా ఆ ఊరితో పాటు రోటిబండ తండాలో కాళరాత్రి రాజ్యమేలింది. ఉదయం దాడి ఘటన తర్వాత పిల్లాజెల్లా ఇండ్లలో ఉండగా, అర్ధరాత్రి పోలీస్ బూటు చప్పుళ్లతో ఒక్కసారిగా ఆ ఊళ్లు ఉలిక్కిపడ్డాయి. ఫార్మా కంపెనీలకు భూసేకరణ విషయంలో సోమవారం లగచర్లకు వచ్చిన కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేకాధికారిపై దాడి తర్వాత పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
అర్ధరాత్రి నుంచే ఈ గ్రామాల వైపు ఎవరినీ వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దాడితో తమకేమీ సంబంధం లేదని మొత్తుకుంటున్నా పోలీసులు పట్టించుకోలేదు. దొరికినవారు దొరికినట్టుగా అనుమానంతో సుమా రు 55 మంది అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు. దాడి సందర్భంగా వివిధ టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో ఉన్నవారిని గుర్తించాలంటూ వారి నుంచి వివరాలను రాబట్టారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం దాడిలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేశారు. మిగతా వారిని వదిలిపెట్టారు. దాడిలో పాల్గొనని వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఆ సమయంలో అసలు గ్రామంలో లేని వారిని అదుపులోకి తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసును పోలీసు ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షించారు.
వికారాబాద్ ఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు అర్ధరాత్రి పూట వాహనాల్లో తండాకు దూసుకొచ్చారు. తండాలో కనిపించిన ఇండ్ల తలుపులు బాది, బెదిరించి దుర్భాషలాడుతూ, ఇతర కుటుంబ సభ్యుల ముందే కొట్టుకుంటూ పలువురిని లాక్కెళ్లారు. తమ వాళ్లు లేరని చెప్పినా వినకుండా బాత్రూంలో, ఇతర ప్రదేశాల్లో టార్చ్లైట్లు వేసి మరీ వెతికారు. సమీపంలోని పొలాల వద్ద కూడా జల్లెడ పట్టారు. కనపడిన వారందరినీ వెంట తీసుకొచ్చి డీసీఎం వాహనాల్లో ఎక్కించి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందోనని తెలుసుకొనేలోపు మగవాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో లగచర్ల గ్రామంలో కర్ఫ్యూ వాతావరణం తలపించింది.
సాధారణంగా మత కలహాలు, ఇతర పెద్ద నేరాలు జరిగిన సమయంలో సంబంధిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేస్తుంటారు. కానీ లగచర్లలో రైతుల నిరసన సమయంలో జరిగిన దాడి ఘటనపై పరిసర మండలాల్లో సైతం ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. దుద్యాల, కొడంగల్, బొంరాస్‌పేట్ మండలాల్లో అధికారులు పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయతలపెట్టిన లగచెర్లతోపాటు హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో మంగళవారం నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. పలు ఇండ్లకు తాళాలు వేసి కనిపించాయి.
దుద్యాల మండలం లగచర్ల బాధితులకు సంఘీభావం ప్రకటించడానికి వస్తున్న బీఆర్ఎస్ బృందా న్ని పోలీసులు అడ్డుకున్నారు. లగచర్ల వైపు ఎవరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు పెట్టి వాహన తనిఖీలు చేపట్టారు. పరిగి, మన్నెగూడతోపాటు ఇతర చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరిన శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, వికారాబాద్, కొడంగల్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పు ల మహేశ్‌రెడ్డి, బీసీ కమీషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, రాష్ట్ర నేత కార్తీక్‌రెడ్డిని పోలీసులు మన్నెగూడలోనే అడ్డగించి అరెస్టు చేశారు.
దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. లగచర్లలో అధికారుల ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశ స్థలానికి రైతులెవరూ రాకపోవడంతో కలెక్టర్ అధికారులతో కలిసి లగచర్లకే వెళ్లారని, వెళ్లాక గ్రామస్థులు అధికారులపై ముప్పేట దాడి చేశారని తెలిపారు.
లగచర్లలో అధికారులపై దాడి ఘటనపై పోలీసులు అరెస్టు చేసిన 16మందిని కొడంగల్‌లోని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీరాం ఎదుట హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని పరిగి సబ్ జైలుకు తరలించారు. అంతకు ముందు పరిగి ప్రభుత్వ దవాఖానలో వారికి వైద్య పరీక్షలు చేయించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో దాడి ఘటనలో గాయపడిన కడా అధికారి నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. కొడండగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) చైర్మన్‌గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి సోమవారం జరిగిన దాడి ఘటనలో గాయపడ్డారు. ఆయన నిమ్స్‌లో చికిత్స తీసుకొని వెళ్లిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఇద్దరు ఆడపిల్లల తరువాత కొడుకు పుట్టిండు. పెద్ద ఎత్తున సంతోషంగా మొదటి పుట్టినరోజు జరుపుకోవాలని సంబురపడ్డాం. 10 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ చుట్టాలను పిలుచుకున్నం. అధికారులపై దాడి జరిగిందని, అర్ధరాత్రి ఇంటికొచ్చిన పోలీసులు నా భర్తను తీసుకెళ్లారు. గొడవకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. కార్యక్రమం ఆగిపోయి కొడుకు పుట్టినరోజు సంబురం లేకుండా చేశారు. నా భర్త కోసం బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాను. కానీ పోలీసులు లేడని చెప్పారు. ఇప్పుడ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మాకు భూమి లేదు. గొడవతో సంబంధమూ లేదు.
– భాత్యశ్రీ, లగచర్ల, దుద్యాల మండలం
పొట్టకూటి కోసం ముంబైకి వెళ్లి బతుకుతు న్నా. ఏడాదికి ఒకసారి తండాకు వెచ్చి వెళ్తం. భర్త చనిపోయిండు. ఆరోగ్యం బాగలేక నా కొడుకుతో కలిసి నాలుగు రోజుల క్రితం తండాకొచ్చిన. జరిగిన దాడిలో నా కొడుకు వినోద్‌కు సంబంధమే లేదు. అర్ధరాత్రి కరెంటు లేని సమయంలో పోలీసులు ఇంటి తలుపులు కొట్టి కొడుకును పోలీసులు తీసుకెళ్లారు. కాల్మొక్త.. నా కొడుకును నాకు అప్పగించండి.
-మున్నీబాయి, రోటిబండ తండా, దుద్యాల మండలం
రేవంత్‌రెడ్డి శానా మంచిగ చేసిండు. ఏం దా డి.. తెల్లార్లు నిద్రల్లేవు.. అర్ధరాత్రి మా వోళ్లను ఏసుకోపోయిండ్రు. ఇల్లు కూడా కూలగొడతారేమో? కూల గొట్కోపో.. ఆయన్ను (రేవంత్‌ను) గెలిపించినందుకు ఈ దారి చూపిస్తున్నాడా? మాతానే ఉండదా? భూమి ఎక్కడ్లేదా? ఈడనే ఉందా? మేం ఇంతనో, అంతనో చేసుకుంటున్నాం. వానలు పడితే పంటలు పండుతాయి. లేకపోతే ఎండుకుపోతాయి. మా భూములు కావాల్సి వచ్చినయా?
– గోగిబాయి, రోటిబండ తండా, దుద్యాల
భూములు గుంజుకొని ఫార్మా కంపెనా? మందిని ముంచెనికే గూసున్నవ్.. అయితే మేం సావాల్నా? మేం సచ్చినంకనే కంపెనీ ఏస్కో.. సీఎం అయినందుకే మమ్మల్ని గిట్ల చేస్తున్నడు. ఊరినే ముంచుతాడని మాకేం తెలుసు. గిసోంటి పని చేస్తడని అనుకున్నమా? ఊర్లు మింగుతున్నారు. మా పిల్లలు గింత చిన్నగున్నప్పుడు బొంబాయికి పోయి.. కన్న కష్టం చేసి ఈ భూమి కొన్నం. ఫార్మా కంపెనీ వద్దు. దవాఖాన పెట్టు. పిల్లలకు స్కూల్ కట్టు.. గిదేం పని.
– లక్ష్మీబాయి, లగచర్ల, దుద్యాల మండలం
కూతురుకు అన్న ప్రాసన నిర్వహించే కార్యక్రమంలో నా భర్త నరేందర్‌గౌడ్ ఏర్పాట్లు చేస్తున్నాడు. సోమవారం తాండూరుకు వెళ్లి పనులు చూసుకొని రాత్రి ఇంటికి వచ్చాడు. గొడవతో నా భర్తకు ఎటువంటి సంబంధం లేదు. అర్ధరాత్రి పోలీసులు ఇంటి తలుపులు కొట్టి నిద్రలేపి ఉన్నపళంగా లాక్కొని పోయారు. మాకు ఎటువంటి భూమి లేదు. మాకు గౌరారంలో భూమి ఉన్నది. నా పెద్ద కూతురు ప్రాణం బాగాలేదు. ఇంట్లో మగవాళ్లు ఎవరూ లేదు. ఇప్పడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– అద్విక, లగచర్ల, దుద్యాల మండలం
అర్ధరాత్రి ఒక్కసారిగా 300 మంది పోలీసులు తండాకొచ్చి ఆడోళ్లని కూడా చూడకుం డా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఇంట్లో ఎవరున్నారు.. అంటూ జొరబడి ఆడోళ్లపైనా ఇష్టం వచ్చినట్టుగా చేతులు వేసి ఇబ్బంది పెట్టారు. చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. రాత్రి పూట వచ్చి భయపెట్టారు.10 నెలలుగా ఫార్మా కంపనీతో భయపడుతూనే కాలం గడుపుతు న్నాం. భూములు పోతే ఏంచేయాలి.మా భూములు గుంజుకోవడం ఎంతవరకు సమంజసం.
-సక్రిబాయి. రోటిబండ తండా, దుద్యాల మండలం