Jagadish Reddy : పుట్టుకతో అజ్ఞానం ఉంటే జ్ఞానం పెరగదని, అందుకు రేవంత్‌రెడ్డే ఉదాహరణ అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అందరికీ జ్ఞానం పెరుగుతదని, కానీ రేవంత్‌రెడ్డికి ఉన్న జ్ఞానం పోయిందని అన్నారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి మాట్లాడుతున్నాడని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి సమస్యల మీద మాట్లాడకుండా బూతులు వల్లెవేస్తున్నడని, ప్రజలకు ఎం చేస్తాడో చెప్పకుండా అర్ధంలేని ఆరోపణలు చేయడం సరికాదని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసాలను కప్పిపుచ్చేలా రేవంత్ రోత మాటలు మాట్లాడుతున్నారని, గాంధీలా ఆమరణదీక్ష చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను స్వాతంత్య్రం తెచ్చిన గాంధీతో పోలుస్తూ తెలంగాణ ప్రజలు జాతిపిత అంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి గతంలో చంద్రబాబు, ఇప్పుడు సోనియా జాతిపితలని, భవిష్యత్తులో మోడీ కూడా జాతిపిత అవుతారేమోనని ఎద్దేవా చేశారు.
‘రేవంత్ అజ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. నల్గొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు వ్యతిరేకంగా రేవంత్ శంకుస్థాపనలు చేశాడు. సీఎం జిల్లాకు వస్తే ఏదో ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తారు. కానీ స్థాయి పెరిగినా అవే బూతులు. అర్థంలేని ఆరోపణలు. సీఎం గా రెండేళ్లు గడిచినా రోజురోజుకు సంస్కారహీనత పెరిగిపోతుంది. ఉన్న సమస్యలను పక్కనపెట్టి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నడు. కాంగ్రెస్ సభల్లో ఆయన రోత మాటలతో BRS కు మరింత బలం పెరుగుతున్నది. కాంగ్రెస్ ది బాగుచేసే పనికాదు చెడగొట్టే పనే’ అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.
‘కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని ఆగం చేస్తున్నరు. అభివృద్ధితోపాటు పదేండ్లలో పెంచిన పచ్చదనాన్ని ఎండబెడుతున్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయిండ్రు. మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు. కాంగ్రెస్ మాయగాళ్ళను నమ్మినందుకు నట్టేట ముంచిండ్రు. మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి. మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలి. అభివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న BRS పార్టీ అభ్యర్థులకు పట్టంకట్టాలి. సూర్యాపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం’ అని ధీమా వ్యక్తంచేశారు.