హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మాట తప్పితే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకో అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి సూచించారు. అధికారమే పరమావధిగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రశ్నార్థకమైందని గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో చెప్పేందుకు ముక్రా (కే) గ్రామమే నిదర్శమని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రా మంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ‘పోస్ట్‌కార్డు ఉద్యమం’ చేపట్టారు. 300 రోజులు దాటినా ఏ ఒక్క హామీని సంపూర్ణంగా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. వాటిని తక్షణమే అమలు చేయించాలని రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. పోస్టు కార్డులు, ముక్రా (కే) గ్రామస్థుల ఫొటోలను రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసం ప్రజలకు సంపూర్ణంగా తెలిసిపోయింది. కనీసం ఇప్పటికైనా మేల్కొని వాటిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.