Karimnagar | విద్యానగర్, జూలై 10: కరీంనగర్ జిల్లా ప్రధాన దవాఖాన పేదల పాలిట అపరసంజీవనిగా మారింది. రోగులకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తున్నది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న ఈ దవాఖాన.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో సకల వసతులు సమకూర్చుకొని మెరుగైన సేవలందిస్తున్నది. ఇప్పుడు లక్షల ఖర్చుతో కూడిన మోకీలు మార్పిడి వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రామన్నపల్లెకు చెందిన బెదుగం సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా కమ్మర్‌ఖాన్‌పేటకు చెందిన మెంగని రమాదేవికి వైద్యులు పైసా ఖర్చు లేకుండా మోకీలు మార్పిడి చేశారు. సోమవారం ఇద్దరినీ డిశ్చార్జి చేశారు. ఏండ్లుగా ప్రైవేట్ దవాఖానల చుట్టూ తిరుగుతున్నా నయం కాని వారి బాధను ఇక్కడి వైద్యులు తీర్చారు. బాధితుల కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.