వెల్దండ, ఆగస్టు 10 : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని గుండాల-వెల్దండ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు మరోసారి గండి పడింది. ఇటీవల ఎగువ నుంచి కాల్వ నీరు దిగువకు వదులుతుండడంతో వెల్దండ సమీపంలోని లచ్చపురం చెరువు వద్ద కేఎల్ఐ కాల్వకు గండి పడింది.
ఆదివారం తెల్లవారు జామున కాల్వ నీరు పంట పొలాల్లోకి వెళ్లడంతో పంటలు మునిగి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు నీరు విడుదల చేసే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్లే ఇలా ప్రతిసారీ కాల్వకు గండిపడుతుందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పదిసార్లు కాల్వకు గండి పడిందని, ఇప్పటికైనా తెగిపోకుండా మరమ్మతులు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.