హైదరాబాద్ : కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అదేవిధంగా పిల్లల దుస్తువుల తయారీలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న కైటెక్స్ గ్రూప్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)లో తొలిదశలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ జాకబ్ వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. తొలిదశ పనులు రెండేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. కైటెక్స్ ద్వారా జౌళిరంగంలో 4 వేల మందికి ఉపాధి లభించనుంది. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. సత్వర నిర్ణయంపై కైటెక్స్ ఎండీ జాకబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండి సాబు జాకబ్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగు అవుతున్న అత్యుత్తమ కాటన్ పంట వంటి అంశాలను తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీఎస్ ఐపాస్ చట్టప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది.
అనంతరం కంపెనీ ప్రతినిధి బృందం కీటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్‌కు వివరించింది. తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా కేరళ అవతల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ ఆసక్తి/ప్రతిపాదన పట్ల స్పందించిన తీరు పైన ప్రశంసలు కురిపించింది. ఇంత వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం చాలా అరుదంది. ఇక్కడి ప్రభుత్వ విధానాలు, టెక్స్టైల్ పరిశ్రమకు ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపింది.
గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఉన్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను కైటెక్స్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి సందర్శించింది. జిల్లా కలెక్టర్ హరితతో కలిసి కంపెనీ ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్పందిస్తూ కేఎంటీపీలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో కంపెనీలను ఏర్పాటు చేయనున్నట్లు కైట్స్ ఎండీ వెల్లడించారు.
Delighted to announce the entry of KITEX group, world’s 2nd largest manufacturer of kids apparel into Telangana with an initial investment of ₹1,000 Cr
— KTR (@KTRTRS) July 9, 2021
They’ve chosen KMTP, Warangal for their factories
My gratitude to Mr. Sabu M. Jacob, MD of KITEX group on a quick decision 🙏 pic.twitter.com/CgMf67DpxN