హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి బహిరంగలేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? .. లేక గాంధీభవన్‌లో పాతరేశారో ప్రజలకు తెలియజేయాలని ప్రశ్నించారు. అధికారం చేపట్టి రెండేండ్లు అవుతున్నా ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని నిలదీశారు. రెండేండ్ల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డిని మీరు ఎందుకు అభినందించారు..? హామీలు ఎగ్గొట్టినందు కా.? ప్రజలను మోసం చేసినందుకా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధిని చాటుకొని 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.