హైదరాబాద్, అక్టోబర్3 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కూలుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్తీల్లోని పేదల బతుకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఛిద్రం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో ఎకడా, ఏ ప్రభుత్వమూ ఇలా పేదల ఇండ్లను కూల్చలేదని తెలిపారు. ముందు పెద్దలు నిర్మించిన ఎస్టేట్ కంపెనీలు, ఫాంహౌజ్‌లు, ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చాలని సవాల్ విసిరారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు గర్హనీయమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర మహిళల వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.