Tejasvi Surya | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు తీరుపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. భారత్-పాకిస్థాన్ కన్నా దారుణంగా ఏపీ, తెలంగాణ విభజన జరిగిందని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో తీవ్రదుమారం చెలరేగింది. తేజస్వీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, తెలంగాణ వాదులు, మేధావులు, విద్యార్థి సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.
ఇది గ్రహించిన బీజేపీ గురువారం రాత్రి పార్లమెంట్లో పొద్దుపొయ్యాక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఓ ప్రకటన చేయించింది. తెలంగాణ ప్రజలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అవమానించేలా తేజస్వీ సూర్య మాట్లాడలేదని కిషన్‌రెడ్డి వెనుకేసుకొచ్చారు. ఒకవేళ అవమానించేలా మాట్లాడితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని మాత్రమే తెలిపారు. కానీ, ఎక్కడా క్షమాపణ కోరలేదు.
కిషన్‌రెడ్డి తర్వాత మాట్లాడిన తేజస్వీ సైతం తన వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీరించారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూడటంతోనే 1,200 మంది విద్యార్థులు చనిపోయారని, అమరవీరులపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఎక్కడ కూడా క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం.
కిషన్‌రెడ్డి మాత్రం శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. గురువారం రాత్రి పార్లమెంట్లో తనతోపాటు తేజస్వీ ఈ అంశంపై క్షమాపణ చెప్పారనడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. తేజస్వీ సూర్య, కిషన్‌రెడ్డిని కలిసి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ క్షమాపణ చెప్పి ఉంటే ఆ వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.