హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎన్నికల హామీలను అమలుచేయలేక పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని, అప్పులు సైతం పుట్టడం లేదని పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్లో నిర్వహించిన ‘సంస్థాగత ఎన్నికల పర్వం-2024’లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చుకలు చూపెడుతుందని మండిపడ్డారు.
రేషన్ కార్డులు, రూ.4 వేల పింఛన్ ఇవ్వలేదని, గృహ నిర్మాణాలకు భూమిపూజ చేయలేదని పేర్కొన్నారు. ధాన్యానికి సంబంధించి చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులు, మిల్లర్లతో కుమ్మకై రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ సంస్థాగత ఎన్నికల అధికారి కే లక్ష్మణ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.