హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. అయినా కూడా ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు బీజేపీని విమర్శించడం తగదని తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘ఢిల్లీ ప్రభుత్వంలోని అధికారుల ఫిర్యాదు మేరకు లిక్కర్ పాలసీపై దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల ముందు అందరూ సమానమే. అవినీతి, కుంభకోణాలపై విచారణ జరపకుండా ఎలా వదిలేయగలం’ అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలో మార్పులు చేస్తున్నప్పుడు కవిత సహకరించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓపెన్బార్లు, బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కోట్లు సంపాదించాలన్నదే మీ లక్ష్యమా? అని కిషన్రెడ్డి నిలదీశారు.