హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి గాడిదగుడ్డును తలపై పెట్టుకుని ఊరేగుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పాలనలో కాంగ్రెస్ ప్రజలకిచ్చింది ఇదేనని చెప్తున్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. వరంగల్‌కు చెందిన కార్పొరేటర్ కల్పన, ఇతర నేతలు బుధవారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసిన సీఎం రేవంత్‌రెడ్డి తీరు ఆందోళనకరంగా ఉన్నదన్నారు.
పంద్రాగస్టుకు రుణమాఫీ అని ఊదరగొడుతున్నారని, మిగతా గ్యారెంటీల సంగతేమిటని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం లేదని, అందుకే అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే ఇటలీదని, తెలంగాణ ప్రజల సొమ్మును ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకోవడం కాదని, తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.