హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): దళిత బంధు లబ్ధిదారులు తమ యూనిట్ల వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రధాని మోదీ ఫొటోలు పెట్టుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై లబ్ధిదారులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమను ఆదుకున్నది, తమ కుటుంబాలకు దారి చూపింది సీఎం కేసీఆరేనని స్పష్టం చేస్తున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా వల్లే దళితబంధు అమలైందన్న కిషన్రెడ్డి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.
కిషన్ రెడ్డి కాస్త అవగాహన పెంచుకొని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. దళిత బంధు పథకం సీఎం కేసీఆర్ మేధోమథనం నుంచి పుట్టిన పథకమని, దీని అమలుకు గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే నిధులు కేటాయించారని గుర్తు చేస్తున్నారు. అప్పటికి ఈటల రాజీనామా చేయలేదని, మరి పథకం తమవల్లే అని బీజేపీ ఎలా డప్పు కొట్టుకుంటుందని విమర్శిస్తున్నారు. పైగా ఇది ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి కాపీ కాదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని మిషన్ భగీరథను కేంద్రం హర్ ఘర్ జల్గా కాపీ కొట్టిందని, రైతుబంధును కిసాన్ సమ్మాన్ యోజనగా మార్చిందని.. మరి కేంద్ర ప్రభుత్వం, లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకోవాలని కిషన్ రెడ్డి సూచించగలరా? అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అడ్డగోలు వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.