హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కిషన్‌రెడ్డి ముందుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న అంబేదర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేండ్లలో విద్యుత్ కొరతకు ప్రధాని మోదీ చెక్ పెట్టారని, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇండ్లకు సరిపడా కరంటు సరఫరా అవుతున్నదని తెలిపారు. ఇందుకు బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరగడమే ప్రధాన కారణమని చెప్పారు.
శక్తివంతమైన భారత్‌ను రూపొందించడంలో బొగ్గు, గనుల శాఖల పాత్ర కీలకమని, దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. మరోవైపు బండి సంజయ్ నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ హాజరై బండి సంజయ్‌ని ఆశీర్వదించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి నిత్యానందరాయ్, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, రాజాసింగ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, సంకినేని వేంకటేశ్వరరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి, సుభాష్ తదితరులు అభినందనలు తెలిపారు.
ఢిల్లీలోని రాజీవ్ గాంధీభవన్‌లో ప్రత్యేక పూజలు చేసి పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాబినెట్లో అత్యంత చిన్న వయస్సులో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్‌పై దృష్టి పెడతామని వివరించారు.