వరంగల్: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలైనా ఒక్క కొత్త ఉద్యోగాన్ని(Jobs) భర్తీ చేయలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఉద్యోగాలనే భర్తీ చేశా రని ఆయన అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్ నగరానికి విచ్చేసిన మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాలలో వ్యతిరేక వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో గారడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిరోజు అప్పుల కోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతాంగం, రైతు కూలీలు, విద్యార్థులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైం దన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ చెప్పినట్లుగా మోదీని, కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజలను దృష్టిని మళ్లించేం దుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుంటే బిజెపి పోరు బాట పడుతుందని హెచ్చరించారు. కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 2026 మార్చి నుంచి ఉత్పత్తులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.