హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని లాలాపేట ప్రాంతానికి చెందిన రక్షిత్ అనే రెండేండ్ల బాలుడు అరుదైన క్యాన్సర్ బారిన పడ్డాడు. 10 లక్షల మందిలో 8 మందికి సోకే న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్తో బాధపడుతున్న ఆ బాలుడికి సికింద్రాబాద్లోని ‘కిమ్స్’ దవాఖాన వైద్యులు విజయవతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
దీంతో ఆ బాలుడు వేగంగా కోలుకున్నట్టు ‘కిమ్స్’ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మధు దేవరశెట్టి వెల్లడించారు. నాడీ కణజాలం నుండి అభివృద్ధి చెందే న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్ సాధారణంగా 15 ఏండ్లలోపు పిల్లలకు సోకుతుందని, మూత్రపిండాలపైన అడ్రినల్ గ్రంథి, మెడ, చాతీ, పెల్విస్ నరాల కణజాలం నుంచి ప్రారంభమయ్యే ఈ వ్యాధి 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు.