Kidney | ఖైరతాబాద్, మే 16 : నిమ్స్ దవాఖానలో కిడ్నీ బ్రోకర్ అవతారమెత్తిన ఓ వార్డు బాయ్ ఉదంతం వెలుగుచూసింది. కిడ్నీలు ఇప్పిస్తానంటూ ఇద్దరు డయాలిసిస్ రోగులకు ఆశచూపగా, వారిలో ఒకరు రూ.1.50 లక్షల నగదు ఇచ్చారు. ఎన్నిరోజులు గడిచినా దాట వేస్తుండటంతో బాధితుడు దవాఖాన ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయ్యింది.
వరంగల్ జిల్లాకు చెందిన మహ్మద్ సాబీర్ (43)కు రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో 2023 నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అదే ఏడాది నవంబర్‌లో వీరస్వామి అనే వ్యక్తి ద్వారా వార్డుబాయ్ నాగరాజు పరిచయమయ్యాడు. తాను నిమ్స్ రేడియాలజీ విభాగంలో ఉద్యోగినని, నెలరోజుల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు ఏర్పాటు చేయిస్తానని నమ్మబలికాడు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స కోసం రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని నమ్మించడంతో బాధితుడు వివిధ రూపాల్లో రూ.1.50 లక్షలు చెల్లించాడు.
ఈ విషయాన్ని అతని సోదరుడు అమ్జద్ దృష్టికి తీసుకురాగా, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు జీవన్‌దాన్ ద్వారానే సాధ్యమవుతుందని, ఎలాంటి రుసుము వసూలు చేయరని చెప్పడంతో ఈ విషయాన్ని వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి నిర్ధారించుకోవడంతో నాగరాజు చేసిన మోసాన్ని గ్రహించాడు. తక్షణమే యాజమాన్యానికి జరిగిన మోసాన్ని లేఖ రూపంలో వివరించాడు. దీంతో యాజమాన్యం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతోపాటు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నాగరాజును అదుపులోకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
వార్డు బాయ్ నాగరాజు కేవలం సాబీర్నే కాకుండా మరోవ్యక్తితో సైతం కిడ్నీ విషయమై బేరసారాలాడినట్టు తెలిసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. అందులో ‘మీ ఇద్దరికీ కిడ్నీలు ఇప్పించే బాధ్యత నాదే.. నా పేరు నాగరాజు రేడియాలజీ విభాగం ఉద్యోగిని’ అని చెబుతున్న వీడియోను బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించి అతని మోసాన్ని బట్టబయలు చేశారు. కిడ్నీల బేరసారాల ఘటనలో పెద్దల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడేండ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఇప్పటివరకు పై అధికారుల దృష్టికి వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నీలు ఇప్పిస్తామంటే ఎవరినీ నమ్మవద్దని, ఏ ఒక్కరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నిమ్స్ నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు సూచించారు. డయాలసిస్ చేసుకుంటున్న రోగులకు జీవన్‌దాన్ ద్వారా మాత్రమే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.