మక్తల్, ఆగస్టు 1 : ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపురంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ చదువులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన చెందారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారని, వీరిలో ఒకరు ఉన్నత విద్య నిమిత్తం సెలవుపై వెళ్లగా.. మరో ఉపాధ్యాయురాలు అనారోగ్యం కారణంతో డిప్యూటేషన్‌పై సొంత జిల్లాకు వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఒక టీచర్ మాత్రమే ఉన్నారని, మరో ఇద్దరు డిప్యూటేషన్‌పై వచ్చినా.. విద్యార్థులు విద్యలో వెనుకబడిపోతున్నారని వాపోయారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నదని పలుమార్లు స్థానిక, మండల అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి శ్రీహరి ఇలాకాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.