ఆదిలాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): ‘ఆదిలాబాద్, నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డి అన్ని ప్రభుత్వ పాలనా వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీంతో మేం ఏ కాంగ్రెస్ కార్యకర్తకూ న్యాయం చేయలేకపోతున్నాం’ అని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్పై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట ఆయన తన నిరసన గళం వినిపించారు. తాను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, ఆదిలాబాద్ జిల్లాలో నరేశ్‌జాదవ్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా, బీజేపీ ఎమ్మెల్యేలకే పనులవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌పై బీజేపీ నాయకులు, కార్యకర్తలు నోటికివచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యవహారాలపై మంత్రులు దృష్టి సారించాలని కోరారు.
తన నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, తమ ఏరియా పిల్లలు ఎలాంటి ఉద్యోగాలకు పనికిరారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఎవరో అపాయింట్మెంట్ చేస్తున్నారని, మంత్రు లు ఇక్కడి అధికారులకు ఫోన్లు చేసేటప్పుడు డీసీసీ అధ్యక్షులను, ఎమ్మెల్యేలను అడుగాలని కోరారు. ఎవరో ముక్కు, మొఖం తెలియని వారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అర్హులైన వారి వివరాలు అందజేసినా వారికి ఇండ్లు మంజూరు కాలేదని తెలిపారు. తాను అధికారులను అడిగితే మంత్రి చెప్పారంటూ సమాధానం ఇస్తున్నారని, మంత్రుల పేర్లు చెప్పుకొని అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకొనే అవసరం ఉన్నదని హితవు పలికారు.